Donald Trump: ట్రంప్ పదవికి ఎసరు పెడుతున్న కరోనా... చాపకింద నీరులా జో బిడెన్ కు పెరుగుతున్న మద్దతు!
- ట్రంప్ కన్నా ఆరు పాయింట్ల లీడ్ లో బిడెన్
- 46 శాతం మంది మద్దతు బిడెన్ కే
- ట్రంప్ వైపున్నది 40 శాతం మంది మాత్రమే
- రాయిటర్స్ ఒపీనియన్ పోల్
అమెరికాలో కరోనా వ్యాప్తి నివారణకు సరైన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించలేదని ప్రజలు భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో కరోనా వైరస్ ఆయన పదవికి చేటు తెచ్చి పెట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డెమోక్రాట్ల తరఫున ట్రంప్ తో పోటీ పడుతున్న జో బిడెన్ కు రిజిస్టర్డ్ ఓటర్లలో మద్దతు క్రమంగా పెరుగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ లో ఆయన తన ప్రత్యర్థి ట్రంప్ కన్నా మరింత ముందుకు వెళ్లిపోయారు.
రాయిటర్స్ / ఇప్సాస్ ఓ ఓపీనియన్ పోల్ ను నిర్వహించి, దాని ఫలితాలను నిన్న వెలువరించింది. 30వ తేదీన తాము 1,100 మంది అమెరికన్ పౌరుల నుంచి అభిప్రాయాలను సేకరించామని, 46 శాతం మంది ఓటర్లు జో బిడెన్ వైపు మొగ్గు చూపారని తేలిందని రాయిటర్స్ ప్రకటించింది. నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో 40 శాతం మంది మాత్రమే ట్రంప్ కు మద్దతుగా ఓటేస్తామని తెలిపారని వెల్లడించింది.
మార్చి 6 నుంచి 9 మధ్య కాలంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో కేవలం 1 పాయింట్ లీడ్ లో ఉన్న బిడెన్, ప్రస్తుతం 6 పాయింట్ల లీడ్ లోకి వచ్చారని పేర్కొంది. కరోనా వైరస్ అమెరికాలో 1.84 లక్షల మందికి సోకగా, ఇప్పటికే 3,700 మందికి పైగా మరణించారని గుర్తు చేసిన రాయిటర్స్, ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం జో బిడెన్ ను రాజకీయంగా నష్టపరచలేకపోయిందని, ఇదే సమయంలో ఈ ప్రభావం ట్రంప్ పై స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జో బిడెన్ సైతం ప్రస్తుతం ప్రజల్లో లేరు. సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ట్రంప్ మాత్రం నిత్యమూ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ, వైరస్ పై సమీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో షాపుల మూసివేత, లోకల్ షట్ డౌన్ కారణంగా తమ ఉపాధిని కోల్పోయామని 26 శాతం మంది ప్రజలు భావిస్తున్నారని, ట్రంప్ సకాలంలో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది.