Bhadradri Kothagudem District: భద్రాద్రిలో భక్తులు లేకుండానే నవమి వేడుకలు.. మూడున్నర శతాబ్దాల కాలంలో తొలిసారి!

Sri Rama Navami Festival without Devotees in Bhadrachalam

  • నిత్యకల్యాణ మండపం వద్ద కల్యాణ వేడుకలు
  • మూడు లక్షల రూపాయల వ్యయంతో పుష్పాలతో మండపం అలంకరణ 
  • ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

భద్రాచలంలో నేడు నిర్వహించనున్న శ్రీరామ నవమి ఉత్సవాలను కనులారా తిలకించే భాగ్యం ఈసారి భక్తులకు దక్కలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల భాగస్వామ్యం లేకుండానే రాములవారి కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. రామాలయ మూడున్నర శతాబ్దాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

అంతేకాదు, దేవస్థానం చరిత్రలో తొలిసారి ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద కల్యాణం నిర్వహించనున్నారు. కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  రాములోరి కల్యాణం, మహాపట్టాభిషేకం కోసం అధికారులు మూడు లక్షల రూపాయల వ్యయంతో మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. ఇతర ఏర్పాట్లకు మరో రూ. 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015, 2016 సంవత్సరాలలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో గత నాలుగేళ్లుగా భద్రాద్రి వెళ్లలేకపోయారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో ఈసారి కూడా కేసీఆర్ హాజరు కాబోవడం లేదు. దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.  

  • Loading...

More Telugu News