Facebook: విండోస్, మాక్ యాప్స్ ఆవిష్కరించిన ఫేస్ బుక్
- ఫేస్ బుక్ ప్రారంభమై 9 సంవత్సరాలు
- బ్రౌజర్ వర్షన్లలోని అన్ని ఫీచర్లతో డెస్క్ టాప్ యాప్స్
- స్వయంగా వెల్లడించిన మార్క్ జుకర్ బర్గ్
ఎంతో కాలంగా నెటిజన్లను ఊరిస్తున్న ఫేస్ బుక్ మెసింజర్ యాప్ డెస్క్ టాప్ వర్షన్ వచ్చేసింది. సామాజిక మాధ్యమంగా ఫేస్ బుక్ ప్రారంభమైన 9 సంవత్సరాల తరువాత డెస్క్ టాప్ యాప్స్ రావడం గమనార్హం.
ఇటీవలి కాలంలో డెస్క్ టాప్ బ్రౌజర్ ఆడియో, వీడియో కాలింగ్ 100 శాతం పెరగడంతో, మాక్, విండోస్ డెస్క్ టాప్ యాప్స్ వర్షన్లను నేడు విడుదల చేస్తున్నట్టు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతమున్న బ్రౌజర్ వర్షన్ లో ఉండే అన్ని ఫీచర్లూ ఈ వర్షన్ లోనూ ఉంటాయని, చాట్ థ్రెడ్స్ మరింత సులువుగా దాచుకోవచ్చని జుకర్ బర్గ్ వెల్లడించారు.
కాగా, గత సంవత్సరం జరిగిన ఎఫ్8 కాన్ఫరెన్స్ లో ఫేస్ బుక్ మెసింజర్ డెస్క్ టాప్ యాప్స్ ను విడుదల చేయనున్నట్టు తొలిసారిగా ప్రకటించింది. ఈ సంవత్సరం ఎఫ్9 కాన్ఫరెన్స్ కరోనా వైరస్ కారణంగా రద్దయింది. అయితే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, వీటిని విడుదల చేసింది. అంతకుముందే మాక్, విండోస్ వర్షన్లను టెస్ట్ చేసి, ఏ విధమైన ఇబ్బందీ లేదని తేల్చింది.
కాగా, ప్రస్తుతం ఫేస్ బుక్ మెసింజర్ ద్వారా కేవలం 8 గ్రూప్ వీడియో కాల్ పార్టిసిపెంట్లతో ఒకేసారి వీడియో చాటింగ్ చేయవచ్చు. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ, డెస్క్ టాప్ యాప్ వర్షన్ బయటకు వచ్చినా, దీని వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండబోవని కూడా సమీక్షలు వస్తున్నాయి.
ఈ యాప్, ఇతరులు కాల్ లో జాయిన్ అయ్యేలా ఏ విధమైన యూఆర్ఎల్ ను అందించదు. అంటే, పబ్లిక్ సెమినార్లు, సోషల్ ఈవెంట్లు జరిగితే, ప్రజలకు పెద్దగా ఉపకరించదు. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ లేకపోవడం మరో పెద్ద మైనస్. ఏదిఏమైనా, ఈ యాప్ ను తమ తమ డెస్క్ టాప్ లో లోడ్ చేసుకునేందుకు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.