Andhra Pradesh: విజయవాడలో సంచార రైతు బజార్లుగా మారిన సిటీ బస్సులు!
- విజయవాడలోని 53 డివిజన్ల పరిధిలో సంచార రైతు బజార్లు
- ఐదు బస్సుల ద్వారా కూరగాయల అమ్మకం
- తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయల విక్రయం
లాక్డౌన్ కారణంగా కూరగాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ ముందుకొచ్చారు. వీలైనంత ఎక్కువమందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. నగరంలో నిన్న ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సంచార రైతు బజార్లకు విశేష స్పందన లభించిందని కమిషనర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని 53 డివిజన్ల పరిధిలో కూరగాయలు విక్రయించాలని యోచిస్తున్నారు. బస్సుల ద్వారా ప్రజల వద్దకే కూరగాయలను తీసుకెళ్లడం ద్వారా ప్రజలు ఒకే చోట గుమికూడకుండా చేయవచ్చన్నది అధికారుల ఆలోచన. ఇందులో భాగంగా నిన్న ఐదు బస్సుల ద్వారా ప్రయోగాత్మకంగా వివిధ ప్రాంతాల్లో సంచార రైతు బజార్లను నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించామని అధికారులు తెలిపారు.