Hyderabad: లాక్డౌన్ సమయం.. జీహెచ్ఎంసీకి ఈ విధంగా ఉపయోగపడుతోంది!
- 11 ప్రాంతాల్లో పనులు
- కేటీఆర్ సూచనలతో వేగవంతం
- ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో సులువుగా పనులు
- ఇప్పటికే రూ.356 కోట్ల పనులు పూర్తి
హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక రోడ్లపై ఫ్లై ఓవర్లు, రోడ్డు మరమ్మతులు వంటి పనులు చేపడితే అక్కడ వాహనదారులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 21 రోజుల లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావట్లేదు. ట్రాఫిక్ జామ్ అనే మాటేలేదు. దీంతో లాక్డౌన్ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శర వేగంగా ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్ రోడ్ల పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తోంది.
రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు..
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా హైదరాబాద్‌లోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కరోనా నేపథ్యంలో తక్కువ మంది కార్మికులతోనే ఈ పనులు కొనసాగిస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనలతో లాక్డౌన్ సమయంలో జీహెచ్ఎంసీ ఈ పనుల వేగాన్ని పెంచింది.
ఇప్పటికే రూ.356.47 కోట్ల పనులు పూర్తి..
మొత్తం 11 ప్రాంతాల్లో రూ.834.44 కోట్లతో ఈ పనులు మొదలు పెట్టగా ఇప్పటివరకు రూ.356.47 కోట్ల పనులు పూర్తయ్యాయి. 2020 జూన్‌లోగా మిగతా రూ.436.52 కోట్ల పనులను కూడా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించింది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో పనులు మరింత వేగంగా కొనసాగిస్తున్నామని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు తెలిపారు.
సామాజిక దూరం పాటిస్తోన్న కార్మికులు..
కార్మికులు సామాజిక దూరం పాటిస్తూనే ఈ పనులు చేస్తున్నారని ఇంజనీర్లు చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్ పేమెంట్లలో జాప్యం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
పనులు జరుగుతున్న ప్రాంతాలు..
ప్రస్తుతం ఎల్బీనగర్ రింగ్ రోడ్, నాగోల్ ఎక్స్‌రోడ్, కామినేని జంక్షన్, బైరమల్గూడ జంక్షన్, రోడ్ నంబరు 45 బయోడైవర్సిటీ జంక్షన్, జూబ్లిహిల్స్ ఎలెవేటెడ్ కారిడార్, ఓయూ కారిడార్, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్ రోడ్ అండర్ బ్రిడ్జ్, పంజాగుట్ట గ్రేవ్‌యార్డ్ ర్యాంప్, ఒవైసీ ఆసుపత్రి జంక్షన్, బహదూర్ పూరా జంక్షన్ ప్రాంతాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తవుతుండడంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు సగం తీరినట్లే.