Haryana: కరోనా వ్యాపించకుండా హర్యానాలో చూయింగ్ గమ్పై 3 నెలల నిషేధం
- ఇప్పటికే గుట్కాపై నిషేధం అమలు
- తప్పకుండా పాటించాలని సూచనలు
- యూపీలోనూ పాన్ మసాలా బ్యాన్
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్ గమ్పై మూడు నెలల నిషేధం విధించింది. వాటి అమ్మకాలు, వినియోగం జరగకూడదని ప్రభుత్వం సూచించింది. వాటిని తిని నోట్లోంచి కింద పడేస్తోన్న సమయంలో, పడేశాక వాటి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పలు శాఖ అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది. హర్యానాలో దాదాపు 13, 000 మంది కరోనా అనుమానితులను క్వారంటైన్లో ఉంచామని అక్కడి అధికారులు తెలిపారు. హర్యానాలో గత ఏడాది సెప్టెంబరులో గుట్కా, పాన్ మసాలా వంటి వాటిపై కూడా ఏడాది పాటు నిషేధం విధించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీటి నిషేధాన్ని కూడా తు.చ. తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు మరోసారి సూచనలు జారీ చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ చర్యలు కరోనా వ్యాప్తినిరోధానికి పని చేస్తాయని తెలిపింది.