Corona Virus: మాస్కులతో ఫ్రాన్స్ వెళుతున్న విమానాన్ని అమెరికా అధికధర చెల్లించి తమ దేశానికి మళ్లించిందంటూ కలకలం!
- చైనా నుంచి ఫ్రాన్స్ వెళుతున్న విమానం
- అమెరికన్లు మూడు రెట్లు అధికధర ఆఫర్ చేశారంటూ కథనాలు
- అంతా వట్టిదేనన్న అమెరికా
కరోనా కారణంగా తీవ్రంగా నష్టం చవిచూస్తున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. మాస్కులకు, శానిటైజర్లకు సైతం తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. చైనా నుంచి మాస్కులతో ఫ్రాన్స్ వెళుతున్న విమానాన్ని అమెరికా ప్రతినిధులు మూడు రెట్ల నగదు ఆశచూపి తమ దేశం మళ్లించినట్టు కథనాలు వచ్చాయి. ఆ విమానం షాంఝై ఎయిర్ పోర్టు నుంచి మరికొద్దిసేపట్లో ఫ్రాన్స్ వెళుతుందనగా, అమెరికా వ్యక్తుల రంగప్రవేశం పరిస్థితిని మార్చివేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
అయితే, ఓ విదేశీ బృందం మూడు రెట్లు నగదు అధికంగా ఆఫర్ చేసిన మాట నిజమేనని ఫ్రాన్స్ వర్గాలు చెబుతుండగా, అదంతా వట్టి కట్టుకథేనని అమెరికా అంటోంది. చైనా నుంచి ఫ్రాన్స్ వెళ్లాల్సిన మాస్కులను అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా స్పందించారు. ఇలాంటి కథనాలు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతూ, తమ దేశంలోనూ ఇలాంటివేమైనా జరుగుతున్నాయేమో చూడాలంటూ అధికారులను ఆదేశించారు.