Crime News: తబ్లిగ్ జమాత్ సభ్యులు నర్సులను వేధించడం నిజమే: దర్యాప్తులో తేల్చిన పోలీసులు
- క్వారంటైన్లో ఉన్న ఐదుగురు సభ్యుల అర్ధనగ్న విన్యాసాలు
- అశ్లీల పాటలు, హావభావాలతో నర్సుపట్ల ప్రవర్తన
- కేసు నమోదు చేసిన పోలీసులు
క్వారంటైన్లో ఉన్న తబ్లిగ్ జమాత్ సభ్యులు తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్న నర్సుల ఆరోపణలు నిజమేనని ఘజియాబాద్ పోలీసులు తేల్చారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన యూపీకి చెందిన పలువురు సభ్యులకు కరోనా వైరస్ సోకడంతో వారిని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురిని ఘజియాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురు సభ్యులు అక్కడ విధులు నిర్వహిస్తున్న తమ పట్ల అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారని బాధిత నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘బాధిత వ్యక్తుల్లో ఒకరు ఫ్యాంట్ తీసేసి ఆసుపత్రిలో తిరుగుతున్నాడు. మరికొందరు అసభ్యకరమైన పాటలు పాడుతూ వికారమైన హావభావాలు ప్రదర్శిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మేమిచ్చిన మందులు వేసుకోవడం లేదు’ అంటూ బాధిత నర్సులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన ఘజియాబాద్ పోలీసులు నర్సుల ఆరోపణలు నిజమేనని తేల్చారు.
బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ఆరుగురు సభ్యులను ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నర్సులను వేధించిన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.