Corona Virus: కరోనాపై పోరులో అతి పెద్ద నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభం
- జన్ ధన్ మహిళల ఖాతాల్లోకి రూ. 30 వేల కోట్లు
- ఆయా అకౌంట్లలోకి రూ. 500 చొప్పున జమ
- ‘ఉజ్వల’ పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ. 5 వేల కోట్ల కేటాయింపు
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రాణాంతక వైరస్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి లాక్డౌన్ విధించడంతో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అయితే, లాక్డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
దీంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంరూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా అతి పెద్ద నగదు బదిలీ పథకాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలో రూ. 30 వేల కోట్లను జమ చేస్తోంది. అలాగే, ‘ఉజ్వల’ పథకం కింత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్న 8 కోట్ల పేద కుటుంబాలతో లింక్ అయిన ఖాతాలోకి మరో 5 వేల కోట్ల రూపాయలు చేర్చనుంది.
‘ప్రధాన మంత్రి జన్ ధన్’ నగదు బదిలీ పథకంలో భాగంగా మొదటి రోజు నాలుగు కోట్ల మహిళల ఖాతాల్లో రూ. 500 చొప్పున జమ చేశారు. ఈ పథకంలో ఏ ఒక్క లబ్దిదారు నష్టపోకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జన్ ధన్ అకౌంట్లను పున: ప్రారంభించాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. తొమ్మిదో తేదీలోపు ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది. అన్ని ఖాతాల్లోకి ప్రభుత్వం అందిస్తున్న మొత్తం చేరనుంది.
లాక్డౌన్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా పేదలకు మూడు నెలలకు గాను మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కేంద్రం చెప్పింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోలియం సంస్థలు మే, జూన్ నెలల్లో నాలుగో తేదీలోగా నగదు బదిలీ చేయనున్నాయి. ‘ఉజ్వల’ లబ్దిదారులు మూడు 14.2 కిలోల గ్యాస్ రీఫిల్స్‌ను గానీ, ఎనిమిది కిలోల ఐదు గ్యాస్ సిలిండర్లను గానీ ఎంచుకొనే సౌలభ్యం ఉంది. ఒకవేళ జూన్ వరకు 3 సిలిండర్లను ఉపయోగించకపోతే.. నగదు బదిలీ కింద తమ ఖాతాలోకి వచ్చిన డబ్బుతో వచ్చే ఏడాది మార్చి వరకూ గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఓవరాల్ సరఫరా రేటు దెబ్బ తినకుండా ‘ఉజ్వల’ లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందించాలని ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలను కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు 60 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నాయి.