mumbai: వైద్య సిబ్బందికి ఏడు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉచిత వసతి.. ఆఫర్ చేసిన టాటా గ్రూప్
- తాజ్ మహల్ హోటల్‌లోనూ వసతి
- హోటళ్ల పేర్లు వెల్లడించిన సంస్థ
- టాటా సంస్థపై ప్రశంసల జల్లు
కరోనా వైరస్‌పై పోరాడుతూ బాధితులకు సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందికి టాటా గ్రూప్ సంస్థ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే సదుపాయాలు కల్పిస్తోంది. ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌తో పాటు తమకు చెందిన లగ్జరీ హోటళ్లలో వైద్యులకు ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది.
'ఈ విపత్కర సమయంలో మా ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీ సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి పోరాడుతున్న వైద్య సిబ్బందికి మేము మా హోటళ్లలో గదులు అందిస్తున్నాం. మాకున్న ఏడు హోటళ్లలోనూ వైద్య సిబ్బంది ఉండొచ్చు' అని ఆ కంపెనీ ప్రకటించింది.
'తాజ్ మహల్ ప్యాలస్, తాజ్ లాండ్స్ ఎండ్, తాజ్ శాంతాక్రాజ్, ది ప్రెసిడెంట్, గింజర్ ఎంఐడీసీ అదెరి, గింజర్ మదగావ్, గింజర్ నోయిడాల్లో ఉండొచ్చు' అని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వైద్య సిబ్బందిని తమ అద్దె ఇళ్లల్లో ఉండొద్దంటూ పలు చోట్ల అభ్యంతరం పెడుతున్న సమయంలో ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారి సేవలను ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలువురు నేతలు ప్రశంసించారు.