Carrie Symonds: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహచరికి కూడా కరోనా పాజిటివ్
- కేరీ సైమండ్స్ తో సహజీవనం చేస్తున్న బ్రిటన్ ప్రధాని
- ప్రస్తుతం కేరీ గర్భవతి
- ఏడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు కేరీ వెల్లడి
చైనాలోని వుహాన్ నుంచి మొదలై ప్రపంచమంతా వ్యాపించిన కరోనా భూతం ప్రముఖులను కూడా వేటాడుతోంది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ దేశ ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ కరోనా బారినపడ్డారు. తాజాగా, బోరిస్ జాన్సన్ సహచరి కేరీ సైమండ్స్ కూడా కరోనా బాధితుల జాబితాలో చేరింది. బ్రిటన్ ప్రధాని జాన్సన్ కొంతకాలంగా కేరీ సైమండ్స్ తో సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం కేరీ గర్భవతి. ఆమె వయసు 31 సంవత్సరాలు కాగా, బోరిస్ జాన్సన్ వయసు 55 ఏళ్లు.
ఈ జోడీ వేసవిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది సాధ్యమయ్యేలా లేదు. తనకు కూడా కరోనా సోకినట్టు కేరీ స్వయంగా వెల్లడించింది. గత ఏడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపింది. బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఇప్పటికే ఇద్దరిని వివాహమాడగా, ఐదుగురు సంతానం ఉన్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, తన పిల్లల గురించి ఆయన మాత్రం ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు.