America: వణికిపోతున్న న్యూయార్క్.. ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి
- నిన్న ఒక్క రోజే 1100 మంది మృతి
- ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 630 మంది బలి
- అందరూ విధిగా తమ ముఖాలను కవర్ చేసుకోవాలన్న ట్రంప్
కరోనా వైరస్ అమెరికాను కబళిస్తోంది. రోజూ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 1100 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 630 మంది మృతి చెందారు. అంటే ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోయారన్నమాట. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖాలను వస్త్రంతో పూర్తిగా కప్పుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ఉపయోగించి, వైద్యపరమైన మాస్కులను వైద్య సిబ్బంది కోసం వదిలిపెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ శ్వాస, దగ్గు, తుమ్ము ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ట్రంప్ ఈ సూచన చేశారు. ప్రజలను మాస్క్‌లు ధరించాలని చెప్పిన ట్రంప్ మాత్రం తానైతే మాస్క్ ధరించబోనని, మాస్క్‌తో అధ్యక్ష కార్యాలయంలో కూర్చుని వివిధ దేశాధినేతలకు అభివాదం చేయడం తనకు నచ్చని విషయమని ట్రంప్ స్పష్టం చేశారు.