Spain: స్పెయిన్ ఆసుపత్రుల్లో వృద్ధులకు నో ఎంట్రీ!
- ఆసుపత్రుల్లో సామర్థ్యానికి మించి రోగులు
- వృద్ధులను తిప్పిపంపుతున్న వైద్యులు
- ఐసీయూల్లో ఇతర వయసుల వారికి ప్రాధాన్యం
కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడుతున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. ఈ యూరప్ దేశంలో ఇప్పటివరకు కరోనాతో 11,947 మంది మరణించారు. కరోనా బాధితుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది. స్పెయిన్ లోని ఏ ఆసుపత్రి చూసినా రోగులతో క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఉన్న వైద్య సిబ్బంది కూడా సరిపోక నానాయాతన పడుతున్నారు.
దాంతో అక్కడి వైద్యులు వృద్ధులను వెనక్కి పంపించేస్తున్నారు. ఐసీయూల్లో ఇతర వయసుల వారికి తగినంత స్థలం ఉంచాలన్న ఉద్దేశంతోనే వృద్ధులను చేర్చుకోవడంలేదు. ఇక, స్పెయిన్ లోని వృద్ధాశ్రమాల్లో పరిస్థితి ఎవరికైనా కంటతడి పెట్టించకమానదు. జీవితచరమాంకంలో ఉన్న వృద్ధులను చూసుకునే సిబ్బంది లేకపోవడంతో ఆలనాపాలనా కరవై అత్యంత దయనీయ పరిస్థితుల్లో వృద్ధులు ప్రాణాలు విడుస్తున్నారు.