Corona Virus: 15 నుంచి విమానాలు తిరుగుతాయి కానీ... సమయపాలన డౌటే!
- 14తో ముగియనున్న 21 రోజుల లాక్ డౌన్
- ఆపై బుకింగ్స్ స్వీకరిస్తున్న ప్రైవేటు ఎయిర్ లైన్స్
- లాక్ డౌన్ లేకుంటేనే విమానాలకు అనుమతి
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో 15 నుంచి ఎయిర్ ఇండియా మినహా మిగతా అన్ని పౌరవిమానయాన సంస్థలూ విమాన సర్వీసులను నడిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుందని, సమయ పాలన పాటించే అవకాశాలు అంతంతమాత్రమేనని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
21 రోజుల లాక్ డౌన్ అనంతరం 15 నుంచి సర్వీసులను నడిపించేందుకు ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ బుకింగ్ లను తీసుకుంటున్నాయి. "ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అందువల్ల 14 తరువాత పరిమిత సంఖ్యలోనే దేశవాళీ, అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తాం. ఏప్రిల్ 14 తరువాత బుకింగ్స్ స్వీకరించే వెసులుబాటును, స్వేచ్ఛను ఎయిర్ లైన్స్ కు కల్పించాం" అని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇదే సమయంలో 14 తరువాత లాక్ డౌన్ కొనసాగితే, విమానాలు కూడా రద్దువుతాయని, బుక్ చేసుకున్న టికెట్లు వాటంతట అవే క్యాన్సిల్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 వరకూ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి ఎయిర్ ఇండియా బుకింగ్స్ స్వీకరిస్తోంది.
ఇక ఇప్పటికే మాంద్యంలో కూరుకుపోయిన విమానయాన సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో కోతను విధిస్తున్నాయి. ఇండిగో, తన సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోతను ఇప్పటికే ప్రకటించగా, ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మినహా ప్రతి ఉద్యోగికీ, మూడు రోజుల వేతన రహిత సెలవు తప్పనిసరి చేసింది. గో ఎయిర్ సైతం వేతనాల్లో కోతను విధించింది. ఉద్యోగులు రేషనల్ బేసిస్ లో వేతనం లేకుండా సెలవు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన విధించింది.
మార్చి 25న మొదలైన 21 రోజుల లాక్ డౌన్ మరో 8 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వారాలూ అన్ని దేశవాళీ, విదేశీ కమర్షియల్ విమానాలు రద్దయ్యాయి. సరకు రవాణా విమానాలు, ఆఫ్ షోర్ హెలికాప్టర్ సేవలు, వైద్య పరికరాలను తీసుకెళ్లే విమానాలు, ప్రత్యేక విమానాలు, డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతి పొందిన విమానాలకు మాత్రమే టేకాఫ్, ల్యాండింగ్ లకు అనుమతి ఇచ్చారు.