Fire Accident: చెర్నోబిల్ 'అణు' విద్యుత్ కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం.. 16 రెట్లు పెరిగిన రేడియేషన్
- బ్యాడ్ న్యూస్ అంటూ ప్రకటన చేసిన అధికారులు
- 1986 ఏప్రిల్ 25న విద్యుత్ కేంద్రంలో అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం
- శర వేగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెను ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడి అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. 1986 ఏప్రిల్ 25న విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు అప్పట్లో చేసిన ఓ ప్రయోగం విఫలమవడంతో అక్కడి నాలుగవ రియాక్టర్ లో భారీ పేలుడు సంభవించి విధ్వంసం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదంగా దీన్ని అభివర్ణిస్తారు.
తాజాగా, అక్కడి అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రేడియేషన్ స్థాయి సాధారణ స్థాయి కంటే 16 రెట్లు పెరిగిపోయిందని అధికారులు ప్రకటించారు. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఉండే ఈ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను అదుపుచేయడానికి రెండు విమానాలు, ఓ హెలికాప్టర్, 100 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
శనివారం ఈ మంటలు అంటుకోగా ఇప్పటివరకు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాదాపు 250 ఎకరాలలో మంటలు వ్యాపించాయి. 'ఇదో చేదు వార్త. రేడియేషన్ స్థాయి సాధారణ స్థాయి కంటే పెరిగిపోయింది' అని అక్కడి ఓ అధికారి ప్రకటించారు. రేడియేషన్ స్థాయి పెరిగిపోవడంతో మంటలు అదుపు చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి.
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొసాగుతున్నాయని, అక్కడికి సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రమాదం ఏమీ లేదని అధికారులు ప్రకటించారు. అణు విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు నివసించడానికి అనుమతి లేదు. 1986 ఏప్రిల్ 25న విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం అనంతరం అక్కడి సమీప ప్రాంతాల నుంచి లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.