Shinzo Abe: కరోనా ఉద్ధృతి తీవ్రం... జపాన్ లో అత్యయిక పరిస్థితి విధించేందుకు సిద్ధమైన ప్రధాని
- జపాన్ లోనూ 3,500 కరోనా కేసులు
- 85 మంది మృతి
- జాగ్రత్త పడాల్సిన దశ ఇదేనంటున్న మేధావులు
- షింజో అబే ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిళ్లు
అగ్రరాజ్యం, పేద దేశం అనే తేడా లేకుండా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ధాటికి అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించేశాయి. జపాన్ లో కూడా కరోనా రక్కసి కోరలు చాచుతున్న నేపథ్యంలో ప్రధాని షింజో అబే దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టోక్యో మహానగరంలో 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జపాన్ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అత్యయిక పరిస్థితిని మంగళవారం ప్రకటిస్తారని, బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని అక్కడి మీడియా చెబుతోంది. ఆర్నెల్ల పాటు ఈ అత్యయిక స్థితి అమల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడంతో షింజో అబే ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రజల భద్రత కోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి దేశాలతో పోల్చితే జపాన్ లో కరోనా ప్రభావం తక్కువే అయినా, ఆయా దేశాల పరిస్థితి చూసిన తర్వాత ఎమర్జెన్సీ విధించడమే మంచిదని జపాన్ లోని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా ఉనికి వెల్లడయ్యాక జపాన్ లో ఇప్పటివరకు 3,500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 85 మంది మరణించారు.