MOEFCC: దేశంలోని అన్ని జూ పార్క్ లలో ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశాలు
- అమెరికాలో పులి నాడియాకు ‘కరోనా’తో భారత్ లో అప్రమత్తం
- ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సెంట్రల్ జూ అథారిటీ
- దేశంలోని అన్ని ‘జూ’లలో హై అలర్ట్ తో వ్యవహరించాలి
అమెరికాలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోని అన్ని జూ పార్క్ లలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ సీసీ) నేతృత్వంలోని సెంట్రల్ జూ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని అన్ని ‘జూ’లలో హై అలర్ట్ తో వ్యవహరించాలని, అందులోని జంతువులను సీసీటీవీల ద్వారా నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. వింత ప్రవర్తన లేదా లక్షణాలు కనబరిచే వాటిని, అనారోగ్యంగా ఉన్న వాటిని ఐసోలేట్ చేయడం లేదా క్వారంటైన్ లో ఉంచడం చేయాలని ఆదేశించారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల నేపథ్యంలో దేశంలోని అన్ని జూల సిబ్బంది తగు జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.