Prakash Javadekar: పరిస్థితిని గమనిస్తున్నాం, లాక్ డౌన్ ముగింపుపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుంది: ప్రకాశ్ జవదేకర్
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- కేంద్రమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- దేశ ప్రయోజనాల మేరకే నిర్ణయం తీసుకుంటామన్న జవదేకర్
భారతీయులు ఓవైపు కరోనాపై పోరాటం సాగిస్తూనే, మరోవైపు లాక్ డౌన్ ముగింపుపై దృష్టి సారించారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందా? అనే సందేహం ఇప్పుడు అందరిలో కలుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడమే అందుకు కారణం.
ఈ అంశంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా స్థితిగతులు ఎలా ఉన్నాయో తాము ప్రతి నిమిషం గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల మేరకే ఉంటుందని, సరైన సమయంలో నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. కీలకస్థాయి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ క్యాబినెట్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జవదేకర్ తాజా వ్యాఖ్యలు చేశారు.