India: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై వెనక్కి తగ్గిన భారత్.. కీలక నిర్ణయం!
- పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్ అందజేస్తాం
- ఔషధాల పంపిణీపై వస్తోన్న కొన్ని ఊహాగానాలకు చెక్ పెడదాం
- మన సామర్థ్యంపై ఆధారపడిన పొరుగుదేశాలకు కూడా పంపిణీ చేస్తాం
మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్స్‌కు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో పలు దేశాలు భారత్ వైపు చూస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఈ ఔషధం విరివిగా తయారవడమే ఇందుకు కారణం. అయితే, భారత్‌లోనూ కరోనా కేసులు పెరగడంతో వీటి ఎగుమతులపై నిషేధం విధించిన భారత్ ఈ నిర్ణయంపై తాజాగా వెనక్కి తగ్గింది. ఈ విషయంలో తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.
'కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్ అందజేస్తాం. ఔషధాల పంపిణీపై వస్తోన్న కొన్ని ఊహాగానాలకు, ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న ప్రయత్నాలకు చెక్ పెడతాం' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
'కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో పారాసిటిమల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు మొత్తం 14 రకాల ఔషధాలను తగిన మోతాదులో మన పొరుగుదేశాలకు కూడా అందిస్తుంది. మన సామర్థ్యంపై ఆధారపడిన పొరుగుదేశాలకు, అత్యధికంగా ఈ మహమ్మారి బారిన పడిన దేశాలకు కూడా మేము ఈ మందులను సరఫరా చేస్తాం" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ ఇతర దేశాలకు సహకారం అందించాలన్న దృక్పథంతోనే ఉంటుందని తెలిపారు. కొన్ని ఔషధాల విషయంలో మత్రమే ఈ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను అమెరికాకు భారత్ ఎగుమతి చేయకపోతే బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.