Pawan Kalyan: వైద్య, ఆరోగ్య సిబ్బందికి పవన్ కల్యాణ్ అభినందనలు
- నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- వైద్య సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలందిస్తున్నారన్న జనసేనాని
- కరోనా విధుల్లో ఉన్నవారికి పీపీలు అందించాలని సూచన
కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎనలేని సేవలు అందిస్తున్నారు. తమ ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని తెలిసినా, విధి నిర్వహణలో వెనుకంజ వేయకుండా కరోనా రోగుల చికిత్సలో పాలుపంచుకుంటున్నారు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కావడంతో డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బందిపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ వైద్య, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక సందేశం వెలువరించారు.
ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని, ఆ దిశగా ఆరోగ్యవంతమైన సమాజం స్థాపించేందుకు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఓవైపు మహమ్మారి విలయతాండవం చేస్తున్నా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలు చేస్తున్నారని కితాబిచ్చారు. తమకు, తమ కుటుంబాలకు ముప్పు ఉంటుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని విస్మరించకుండా ముందుకు సాగుతున్నవారి సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.
ఈ సందర్భంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పీపీఈలను కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు, ఉద్యోగభద్రతకు చట్టాలు తీసుకురావాలని కోరారు.