Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. భారీగా లాభపడ్డ సెన్సెక్స్!
- 2,476 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 702 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 25 శాతం వరకు ఎగబాకిన ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండటంతో పాటు యూరోపియన్ మార్కెట్లు కూడా లాభాల్లో ఓపెన్ కావడంతో మన మార్కెట్లలో జోష్ పెరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,476 పాయింట్లు లాభపడి 30,067కి పెరిగింది. నిఫ్టీ 702 పాయింట్లు పుంజుకుని 8,786కు చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు లాభాల్లోనే ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (24.84%), యాక్సిస్ బ్యాంక్ (20.39%), హిందుస్థాన్ యూనిలీవర్ (14.23%), మహీంద్రా అండ్ మహీంద్రా (14.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (13.26%) సంస్థలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.