Donald Trump: అంతరిక్ష వనరులపై ట్రంప్ దృష్టి... చంద్రుడిపై ఖనిజాన్వేషణకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్!
- కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం
- మూన్ ట్రెటీపై సంతకం చేయలేదన్న ట్రంప్
- వివిధ దేశాలతో కలిసి పనిచేయాలని నిర్ణయం
ప్రపంచమంతా కరోనా భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనలోని విభిన్నతను మరోసారి చాటారు. తాజాగా ఆయన, అంతరిక్ష వనరులను వినియోగించుకోవడంపై ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను జారీ చేశారు. చంద్రుడు, అంగారక తదితర గ్రహాలపై ఖనిజాన్వేషణ నిమిత్తం తవ్వకాలకు మద్దతివ్వాలని నిర్ణయించారు. విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర ఒప్పందాలను కుదుర్చుకుని, పబ్లిక్, ప్రైవేట్ బాగస్వామ్యాల ద్వారా అంతరిక్ష వనరులను వినియోగించుకునే దిశగా కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.
ఇక ఈ ఆదేశాల ప్రకారం "అంతరిక్షంలోని వనరుల అన్వేషణ, వాటిని వెలికితీసి, వినియోగించుకునే హక్కు అమెరికన్లకు ఉంటుంది. చట్ట ప్రకారమే ఈ కార్యక్రమాలు సాగుతాయి. అంతరిక్షాన్ని ప్రపంచ వనరుగా గుర్తించడం లేదు" అని కూడా పేర్కొనడం గమనార్హం. కాగా, 1979 నాటి చంద్రమండల ఒప్పందంపై అమెరికా సంతకం చేయలేదు. అప్పట్లో అంతరిక్ష కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వుండాలని పలు దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకించింది.
చంద్రమండల ఒప్పందాన్ని పాటిస్తే, ఖనిజాల గుర్తింపు, శాస్త్ర సాంకేతిక అన్వేషణ వాణిజ్యపరంగా సాధ్యం కాదన్నది అమెరికా అభిప్రాయం. ఇక ఈ తాజా ఆదేశాలతో అంతరిక్ష వనరులను ప్రభుత్వ, వాణిజ్య సంస్థల ఉపయోగార్థం వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.