MSME: చిన్న తరహా పరిశ్రమలకు పన్ను రాయితీలు, ఇన్సెంటివ్ లు ఇచ్చే యోచనలో కేంద్రం

Tax Break and Incentives For COVID 19 Hit Small Businesses
  • చిన్న పరిశ్రమలపై లాక్ డౌన్ ప్రభావం
  • వ్యవస్థలో స్తంభించిన నగదు చలామణి
  • భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
లాక్ డౌన్ ప్రభావం చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజల కొనుగోళ్లు అమాంతం పడిపోవడంతో వ్యవస్థలో నగదు చలామణి స్తంభించిపోయింది. దీంతో ఈ సంస్థలన్నీ నష్టాల ఊబిలోకి జారుకుంటున్నాయి. దీని ఫలితం ఉద్యోగాలపై పడుతోంది.  ఈ నేపథ్యంలో, వీటికి జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పన్ను రాయితీలను కల్పించడమే కాకుండా, ఇన్సెంటివ్ లు ఇచ్చేందుకు సన్నాహకాలు చేస్తోంది. వచ్చే వారం దీనికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కరోనా నేపథ్యంలో టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయి. దీంతో, వీటికి నిధులను విడుదల చేసే ఆలోచనను కేంద్రం చేస్తోంది. గత నెలలో ప్రకటించిన 22.6 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కంటే ఇది పెద్దగా ఉండొచ్చని భావిస్తున్నారు.  

ఈ సందర్భంగా ఆర్థిక నిపుణుడు కునాల్ కుందు మాట్లాడుతూ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో ఉద్యోగాలను కాపాడటం పైనే ఎక్కువ దృష్టి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే భారత్ లో నిరుద్యోగ రేటు పెరుగుతోందని.. కనీసం  40 కోట్ల మంది పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనా వేసిందని తెలిపారు.  ఈ నేపథ్యంలో వచ్చే వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
MSME
Jobs
Lockdown
Tax Incentives

More Telugu News