Italy: ఇటలీలో ఇప్పటివరకు 100 మంది డాక్టర్ల మృతి... కరోనా విలయతాండవం!
- ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు
- ఇప్పటివరకు 17,669 మంది మృతి
- రిటైర్డ్ డాక్టర్లను కూడా రంగంలోకి దింపిన ఇటలీ
కరోనా కరాళ నృత్యం చేస్తున్న దేశాల్లో ఇటలీ ముందువరుసలో ఉంటుంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, నిత్యం వందల సంఖ్యలో మరణాలతో ఇటలీ మృత్యుకూపంలా మారిపోయింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇటలీలో 100 మంది డాక్టర్లు కరోనాతో మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. చనిపోయిన డాక్టర్ల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని వైద్య వర్గాలు అంటున్నాయి.
మరణించినవారిలో పదవీ విరమణ చేసిన వైద్యులు కూడా ఉండడం విషాదకరం. కరోనా విజృంభిస్తుండడంతో ఇటలీ ప్రభుత్వం రిటైర్డ్ డాక్టర్ల సేవలు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. వేల సంఖ్యలో రోగులు వస్తుండడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వైద్యులకు సరైన రక్షక కవచ దుస్తులు కూడా అందించలేక అక్కడి ప్రభుత్వం నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీలో 17,669 మంది కరోనాతో మరణించారు.