Boris Johnson: కోలుకుంటున్న యూకే ప్రధాని.. సాధారణ వార్డుకు తరలింపు
- ఆదివారం ఆసుపత్రిలో చేరిన బోరిస్
- వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఐసీయూకు తరలింపు
- కోలుకుంటున్నారన్న వైద్యులు
కరోనా బారినపడి ఆసుపత్రి పాలైన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం కొంత మెరుగవడంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆరోగ్యం మెరుగవుతున్నప్పటికీ మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
బోరిస్లో గత నెలలోనే వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆదివారం ఆయనను లండన్ ఆసుపత్రిలో చేర్చారు. వ్యాధి తీవ్రత ముదురుతుండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పిన వైద్యులు సాధారణ వార్డుకు తరలించారు. విషయం తెలిసిన యూకే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 95,691 మంది చనిపోయినట్టు అంచనా. అలాగే, 16,03,042 మంది కరోనా బారినపడ్డారు. 3,56,421 మంది కోలుకున్నారు. యూకేలో 66,077 కేసులు నమోదు కాగా, 7,978 మంది మరణించారు. 135 మంది కోలుకున్నారు.