Raghava lawrence: అడ్వాన్స్ అందగానే మూడు కోట్ల విరాళం: లారెన్స్ ప్రకటన
- రజనీకాంత్ ‘చంద్రముఖి-2’లో లారెన్స్
- ఎవరెవరికి ఎంతెంత ఇచ్చేదీ ట్వీట్ ద్వారా వివరణ
- తాను పుట్టిన ఊరిలోని దినసరి కూలీలకు రూ. 75 లక్షలు
కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ చేయి కలిపాడు. తాను తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించి అడ్వాన్స్ అందగానే మూడు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు.
అంతేకాదు, ఎవరెవరికి ఎంతెంత విరాళం ఇవ్వాలనుకుంటున్నదీ ట్విట్టర్ ద్వారా వివరంగా చెప్పుకొచ్చాడు. త్వరలో తాను రజనీకాంత్ సినిమా ‘చంద్రముఖి-2’ లో నటించబోతున్నానని పేర్కొన్న లారెన్స్.. ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ అందుకున్న వెంటనే కరోనా వైరస్‌పై పోరుకు రూ.3 కోట్లు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు పేర్కొన్నాడు.
ఇందులో రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు, డ్యాన్సర్స్ యూనియన్‌కు రూ. 50 లక్షలు, తన వద్ద ఉన్న దివ్యాంగులకు రూ. 25 లక్షలు, తాను జన్మించిన రోయపురం-దేశీయనగర్‌లోని దినసరి కార్మికులకు రూ. 75 లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్టు లారెన్స్ వివరంగా పేర్కొన్నాడు.