Visakhapatnam District: కరోనా లక్షణాలు దాచిపెట్టి చికిత్స.. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు!
- విశాఖ నుంచి కత్తిపూడికి వచ్చిన వ్యక్తి
- కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికంగా చికిత్స
- పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలింపు
కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు. రహస్యంగా స్థానిక వైద్యుల వద్ద చికిత్స తీసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. విషయం తెలిసినప్పటికీ గోప్యత పాటించినందుకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని కత్తిపూడికి ఓ వ్యక్తి వచ్చాడు. తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అతడు స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇది తెలుసుకున్న అన్నవరం పోలీసులు, వ్యాధి వుందని తెలిసినా బయటపెట్టనందుకు బాధితుడి మామ, అతడికి చికిత్స చేసిన ఆర్‌ఎంపీ, రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదు చేశారు. మరోవైపు, బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖకు తరలించారు.