Police: పలు నగరాల్లో మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తోన్న పోలీసులు
- ఢిల్లీలో 32 మందిపై కేసులు
- పూణెలో ఏడుగురిపై కేసులు
- మాస్కులు లేకుండా వస్తే అంతే అంటున్న పోలీసులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులను తప్పని సరి చేసిన కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. వాయవ్య ఢిల్లీలో మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చిన 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ రోజు ప్రకటన చేశారు. ఢిల్లీలో అందరూ మాస్కులు ధరించాల్సిందేనని చెప్పారు. మధ్యప్రదేశ్, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లోనూ మాస్కులు ధరించడాన్ని ఇప్పటికే తప్పని సరి చేశారు. ఆయా ప్రాంతాల్లోనూ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు, మహారాష్ట్రలోని పూణె, పింప్రి- చిన్చ్వాద్ ప్రాంతంలో మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చిన ఏడుగురిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు పెట్టామని పోలీసులు వివరించారు. కుద్వెవాడీ, చిఖాలీ ప్రాంతాల పరిధిలో వారంతా నిన్న మాస్కులు ధరించకుండా తిరిగినందుకు గానూ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ పూణె నగర పాలన అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు అందరూ మాస్కులు ధరించాల్సిందేనని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూడా ఆదేశించింది. భారత్‌లోని పలు నగరాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.