Chandrababu: నిన్న డాక్టర్ ను సస్పెండ్ చేశారు... ఇవాళ మున్సిపల్ కమిషనర్ వంతు!: చంద్రబాబు

Chandrababu asks CM Jagan to more human in corona crisis

  • నగరి మున్సిపల్ కమిషనర్ పై సర్కారు ఆగ్రహం!
  • ప్రశ్నిస్తే వేటు వేస్తారా? అంటూ చంద్రబాబు ట్వీట్
  • జగన్ మరింత మానవత్వం ప్రదర్శించాలని డిమాండ్

ఏపీలో మాస్కులు అడిగినందుకు నిన్న ఓ డాక్టర్ ను సస్పెండ్ చేశారని, ఇప్పుడు నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కూడా అదే ఫలితాన్ని చవిచూశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మాస్కులు అడిగితే వేటు వేస్తారా? అంటూ మండిపడ్డారు.

కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు, రక్షణ ఉపకరణాలు లేక నిస్సహాయుల్లా మిగిలిపోతున్నారని, ఇది తీవ్రమైన అంశం అని, ఏపీ సర్కారు వెంటనే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రక్షణ లేకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్న ఈ ముందు వరుస సైనికులైన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది పట్ల వైఎస్ జగన్ మరింత మానవత్వం ప్రదర్శించాలని కోరారు.

తమకు మాస్కులు లేవని, రక్షణ దుస్తులు కావాలని అడిగిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. నగరిలో నాలుగు కరోనా కేసులున్నా, ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, అకౌంట్లను సీజ్ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఓ వీడియోలో తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు ఆయనపై కఠిన ఆంక్షలు విధించింది. వెంకట్రామిరెడ్డిని నగరి విడిచి వెళ్లొద్దని హుకుం జారీ చేయడమే కాదు, ఆయన స్థానంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావును ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ గా నియమించింది.

  • Loading...

More Telugu News