Ambati Rambabu: చంద్రబాబు తన సామ్రాజ్యం కూలిపోయినట్టు మాట్లాడుతున్నారు: అంబటి
- ఎస్ఈసీ రమేశ్ కుమార్ తొలగింపు
- చంద్రబాబు విమర్శలు
- చంద్రబాబుకు ఎందుకంత తాపత్రయం అంటూ అంబటి వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రభుత్వం తొలగించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. రమేశ్ కుమార్ ను పదవిలో ఉంచేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని, తన సామ్రాజ్యం కూలిపోయినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ఆమోదం మేరకే ఆర్డినెన్స్ జారీ చేశామని, ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఎస్ఈసీ పదవీకాలం కుదించడం వల్ల ఇప్పుడున్నవారు పోయి కొత్తవాళ్లు వస్తారని తెలిపారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రజాస్యామ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని, ఎన్నికల సంస్కరణలతో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.