CM Jagan: ఏపీ సీఎం జగన్ దృష్టిలో పరిపాలన అంటే ఫ్యాక్షనిజం: మాజీ మంత్రి జవహర్
- ఫ్యాక్షనిజంలో కక్ష సాధింపే ప్రధాన అజెండా
- నిమ్మగడ్డపై చర్యతో జగన్ తన తీరు చాటుకున్నారు
- లేదంటే ఈ సమయంలో మార్పులేమిటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టిలో పరిపాలన అంటే ఫ్యాక్షనిజమని, ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలగింపుతో ఈ విషయం రుజువయ్యిందని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఆక్షేపించారు.
ఫ్యాక్షనిజంలో కక్ష సాధింపే ప్రధాన అజెండాగా ఉంటుందని, నిమ్మగడ్డపై జగన్ చేసిన పని అదేనని ఎద్దేవా చేశారు. లేదంటే ప్రపంచమంతా కరోనా భయంతో బాధపడుతుంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. రమేష్‌కుమార్‌ను తొలగించి జగన్ తన అహం చల్లార్చుకున్నారని, ఇటువంటి రాజకీయ పోకడలు దేశంలో ఎక్కడా చూడమన్నారు.