Corona Virus: టక్కుటమారి కరోనా.. పరీక్షకు దొరకని వైనం... వైరస్ ఉన్నా నెగెటివ్ ఫలితాలు!
- ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం
- లక్ష దాటిన మరణాల సంఖ్య
- కరోనా టెస్టుల్లో ఫలితాలు సరిగా రాని వైనం
- కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేకపోతున్న పీసీఆర్ టెస్టులు!
- సెరోలాజికల్ టెస్టులపై వైద్య నిపుణుల ఆసక్తి
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న జటిల సమస్య. కంటికి కనిపించని రీతిలో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తుంది. చూస్తుండగానే మరణాల సంఖ్య లక్ష దాటింది. మున్ముందు దీని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నారు. దీన్ని కట్టడి చేశామని చెప్పుకుంటున్న చైనాలో సైతం మళ్లీ కేసులు నమోదవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ దేశం కూడా తాము కరోనాను పారదోలామని సాధికారికంగా చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇక అసలు విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా కరోనా టెస్టులకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. కరోనా వైరస్ ఉన్నాగానీ కొన్నిటెస్టుల్లో నెగెటివ్ అని వస్తోంది. దాంతో కరోనా కలిగివున్న వ్యక్తులు స్వేచ్ఛగా బయటికి రావడం వల్ల మరింతమందికి కరోనా వ్యాపిస్తోంది. కరోనా నిర్ధారించే పరీక్షల్లో సాధారణంగా పీసీఆర్ పరిజ్ఞానం వినియోగిస్తారు. శ్లేష్మం (మ్యూకస్) నమూనాలను పరీక్షించి వైరస్ నిర్ధారణ చేస్తారు.
అయితే, ఆ వ్యక్తిలో ఎంత పరిమాణంలో వైరస్ ఉందన్న దానిపైనా, ఎలాంటి పరిస్థితుల్లో అతని నుంచి నమూనాలు సేకరించారన్న దానిపైనా, ఆ నమూనాలను తరలించే సమయంలో ఎంతసేపు ఆ వైరస్ సజీవంగా ఉందన్నదానిపైనా పరీక్ష ఫలితాలు ఆధారపడి ఉంటాయని మిన్నెసోటాలోని మేయో క్లినిక్ కు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు ప్రియా సంపత్ కుమార్ తెలిపారు.
చైనాలో కరోనా ట్రెండ్ ను గమనిస్తే, వైరస్ ఉన్నా పాజిటివ్ అని వెల్లడైన కేసుల శాతం 60 నుంచి 70 శాతం అని తెలుస్తోంది. మిగతావారికి వైరస్ ఉన్నా నెగెటివ్ రిపోర్టు వస్తోంది. 40 మిలియన్ల మందిలో కేవలం ఒక్క శాతం ప్రజలకు కరోనా పరీక్షలు చేస్తే కనీసం 20 వేల మందికి తప్పుడు రిపోర్టులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ప్రియా సంపత్ కుమార్ ఆందోళన వెలిబుచ్చారు. డాక్టర్లకు ఇది సంకట స్థితి అని, కరోనా వ్యాధి లక్షణాలతో వచ్చే పేషెంట్లకు పరీక్షలో నెగెటివ్ అని వస్తే ఎలా వైద్యం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని, ఇలాంటి నేపథ్యంలో వ్యాధి లక్షణాల ఆధారంగా వైద్యం చేయడం తప్ప మరో మార్గం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఓ వ్యక్తి చీమిడి పరీక్ష చేయగా మూడు సార్లు నెగెటివ్ వచ్చినా, అతడిలో కరోనా లక్షణాలన్నీ ఉన్నాయని బాల్టిమోర్ లోని జాన్ హాప్కిన్స్ ఆసుపత్రి వైద్యుడు డానియెల్ బ్రెన్నెర్ తెలిపారు. చివరికి అతడి ఊపిరితిత్తుల్లోకి ద్రవాన్ని పంప్ చేసి తిరిగి ఆ ద్రవాన్ని సేకరించి పరీక్షించగా అప్పుడు పాజిటివ్ వచ్చిందని వివరించారు.
ఇప్పుడు ప్రపంచానికి సెరోలాజికల్ టెస్టులే ఆశాకిరణంలా కనిపిస్తున్నాయని, ఓ వ్యక్తిలో వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలను ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చని, తద్వారా ఆ వ్యక్తి వైరస్ బారినపడ్డాడో లేదో తెలుసుకోవచ్చని ప్రియా సంపత్ కుమార్ వెల్లడించారు. వ్యక్తి శరీరంలో వైరస్ ఉన్నప్పుడే యాంటీబాడీలు తయారవుతాయని, కరోనా టెస్టుల్లో ఇది కీలకంగా మారుతుందని భావిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు.