India: నేను అలా మాట్లాడలేదు... ఆ తప్పుడు వార్తను నమ్మకండి: రతన్ టాటా
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి ఇండియా వెళుతోందన్నట్టు వార్తలు
- తానేమీ ఆ మాటలు చెప్పలేదన్న రతన్ టాటా
- ఏదైనా చెబితే అధికారికంగానే చెబుతానని వెల్లడి
కరోనా మహమ్మారి కారణంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారని తాను చేసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా ఖండించారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసిన ఆయన, అది ఓ నకిలీ వార్తని, దాన్ని నమ్మవద్దని కోరారు. తాను ఎన్నడూ అటువంటి ప్రకటన చేయలేదని తెలిపారు.
కాగా, మానవ వనరుల స్ఫూర్తి, శ్రమ విలువ నిపుణులకు కచ్చితంగా తెలుస్తుందన్నది తన అభిప్రాయమని, వారి అంచనాల ప్రకారం, ఆర్థిక పతనం భారీ స్థాయిలో ఉండవచ్చని రతన్ టాటా వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఖండించిన టాటా, వార్తల్లో నిజానిజాలేంటో మీడియా ధ్రువీకరించుకోవాలని కోరారు. వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని కోరారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే, మీడియాతో నేరుగా చెబుతానని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
కాగా, రతన్ టాటా, కరోనాపై పోరుకు రూ. 1,500 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.