Mumbai: ముంబై తాజ్ మహల్ సిబ్బందిలో కరోనా పాజిటివ్... హోటల్ లో మొత్తం వైద్య సిబ్బందే ఉండటంతో కలకలం!
- ముంబైలోని కొలాబా ప్రాంతంలో హోటల్
- డాక్టర్లు, హెల్త్ వర్కర్ల బస
- ఆరుగురు ఉద్యోగులకు సోకిన వ్యాధి
ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఐహెచ్సీ నిర్వహణలో ఉన్న ప్రతిష్ఠాత్మక తాజ్ మహల్ ప్యాలెస్, తాజ్ మహల్ టవర్స్ హోటల్ లో ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో, వైద్య వర్గాల్లో కలకలం రేగింది. ఈ హోటల్ లో ప్రస్తుతం అతిథులు ఎవరూ ఉండటం లేదు. కరోనా చికిత్స నిమిత్తం ఇళ్లకు దూరంగా ఉంటున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు మాత్రమే ఇక్కడ బస చేసి వున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని పలు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇక, కొంతమంది తమ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకిందని ఐహెచ్సీ స్పష్టం చేసింది. అయితే, ఎంతమందికి వైరస్ సోకిందన్న విషయాన్ని మాత్రం సంస్థ పేర్కొనలేదు. వీరికి కరోనా సోకినట్టు తేలినా, వ్యాధి లక్షణాలు మాత్రం కనిపించలేదని పేర్కొంది. కాగా, తాజ్ ప్యాలెస్ తో పాటు బాంద్రా ప్రాంతంలో తాజ్ లాండ్, కుఫ్పీ పరేడ్ ప్రాంతంలో వివాంతా ప్రెసిడెంట్, తాజ్ శాంతాక్రజ్ హోటళ్లను ఐహెచ్సీ నిర్వహిస్తోంది. కరోనా సోకిన తాజ్ హోటల్ ఉద్యోగులను బాంబే హాస్పిటల్ లో చికిత్స జరుగుతోందని, వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి కన్సల్టింగ్ ఫిజీషియన్ గౌతమ్ భన్సాలీ వెల్లడించారు.