Corona Virus: కరోనా లాక్ డౌన్ సమయంలో మూడు జోన్లుగా భారత్ విభజన

Centre plans to country to divide into zones with colour code

  • గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించే అవకాశం
  • కేసుల సంఖ్య ఆధారంగా జోన్ ఏర్పాటు
  • ఎల్లుండి లోపు ప్రకటించే అవకాశం

దేశంలో కరోనా వ్యాప్తి, సహాయకచర్యలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. కరోనా వ్యాప్తి తీవ్రతను అనుసరించి భారత్ ను మూడు జోన్లుగా విభజించాలన్నది వాటిలో ముఖ్యమైనది. ఒక ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలన్న ప్రతిపాదన రాగా, దీనికి అనేక మంది ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపినట్టు సమాచారం.

గ్రీన్ జోన్ అంటే... ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చుతారు. ఈ జోన్ లో లాక్ డౌన్ పూర్తిగా సడలించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ఒక్క కొవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చనున్నారు.

ఇక ఆరెంజ్ జోన్ విషయానికొస్తే.... 15 కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండి, పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేని జిల్లాలను ఆరెంజ్ జోన్ గా పరిగణిస్తారు. ఈ ఆరెంజ్ జోన్ జిల్లాల్లో పరిమిత స్థాయిలో ప్రజారవాణా, వ్యవసాయపనులు, ఇతర నిత్యావసర కార్యకలాపాలకు అనుమతిస్తారు.

ఇక, 15 కేసుల కంటే మించి నమోదైన ఏ ప్రాంతాన్నైనా రెడ్ జోన్ గా పరిగణిస్తారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలైనా నిషిద్ధం. లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. ఎల్లుండితో తొలి దశ లాక్ డౌన్ ముగియనుండగా, ఈ లోపే ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని, జోన్ల వారీగా లాక్ డౌన్ సడలింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తారని కేంద్ర వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతానికి భారత్ లో 8,356 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 7,367 మంది క్రియాశీలక రోగులుగా ఉన్నారు. 273 మంది కరోనాతో మరణించగా, 716 మంది కోలుకున్నారు.

  • Loading...

More Telugu News