KTR: తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూతురికి సాయంకై ట్విట్టర్ ద్వారా వినతి.. కేటీఆర్ స్పందన!
- ట్విట్టర్‌లో సాయం అడిగితే వెంటనే స్పందిస్తోన్న కేటీఆర్
- యువకుడి ట్వీట్‌పై సానుకూల స్పందన
- ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లడానికి సాయం చేస్తామని వ్యాఖ్య
- ట్విట్టర్‌లో కేటీఆర్‌కు రైతులు కూడా ట్వీట్లు చేస్తోన్న వైనం
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ట్విట్టర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను సాయం అడుగుతున్నారు. వారి సమస్యల పట్ల వెంటనే స్పందిస్తోన్న కేటీఆర్ వారికి సాయం చేస్తానని హామీ ఇస్తున్నారు.
'కేటీఆర్ సర్.. నా పేరు శ్రవణ్.. మా అంకుల్ చనిపోయాడు.. నాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం. మా అంకుల్ కూతురు ఇక్కడే ఉంది. ఆమె మా అంకుల్‌కు ఒక్కగానొక్క కూతురు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వాంకిడి నుంచి ఆదిలాబాద్ వెళ్లడానికి ఆమెకు సాయం చేయండి' అని ట్వీట్ చేశాడు.
దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. 'మీకు నా సానుభూతి తెలుపుతున్నాను.. కేటీఆర్ ఆఫీస్‌ను సంప్రదించి సాయం పొందండి' అని తెలిపారు.
కాగా, ఓ రైతు ట్విట్టర్‌లో అడిగిన సాయానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. 'డియర్ కేటీఆర్ సర్.. మాది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ గ్రామము.. లాక్‌డౌన్ కారణంగా శనగల కొనుగోలు నిలిచిపోయింది. రైతు పక్షపాతి అయిన మీరు కొనుగోలు ప్రారంభమయ్యేలా చూడండి' అని ఓ రైతు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దీనిపై దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి చెప్పారు.