uae: మీ వాళ్లను వెనక్కి తీసుకెళ్లండి.. లేదంటే కఠిన చర్యలే!: ఆయా దేశాలకు యూఏఈ హెచ్చరిక
- యూఏఈలో క్రమంగా పెరుగుతున్న కరోనా
- నెగిటివ్గా తేలిన పౌరులను సొంత దేశాలకు తీసుకెళ్లాలని చెప్పిన యూఏఈ
- పట్టించుకోని దేశాలు
- వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామన్న యూఏఈ
కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉంటోన్న విదేశీయులను స్వదేశాలకు పంపేయాలని భావిస్తోంది. పౌరులను స్వదేశాలకు తీసుకువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం.
ప్రజలను తిరిగి వెనక్కి తీసుకెళ్లని దేశాలపై తాము వర్క్ వీసాల పరంగా ఆంక్షలు కఠినతరం చేస్తామని తెలిపింది. ఈ విషయంపైనే అక్కడి అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ దేశ జనాభా 90 లక్షలు మాత్రమే. యూఏఈకి చాలా దేశాల నుంచి వలసలు వెళ్లారు.
ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇదే సమయంలో చాలా మంది విదేశీయులు అక్కడ చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 25 వేల మంది పాకిస్థానీయులు దుబాయ్, అబుదాబిలోనే ఉన్నారు. కరోనాతో ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మృతి చెందారు. 3736 మందికి కరోనా సోకింది.
తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధణ పరీక్షల్లో నెగటివ్ వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ మేరకు అన్ని దేశాలకు తాము తీసుకున్న నిర్ణయంపై సమాచారం అందించింది. దీంతో ఇప్పుడు ఈ చర్యలకు సిద్ధమవుతోంది.
అయినప్పటికీ తమ పౌరులను తిరిగి తీసుకెళ్లడానికి చాలా దేశాలు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల వర్క్ వీసాలపై ఆంక్షలు విధిస్తామని యూఏఈ హెచ్చరించింది. యూఏఈలో పాకిస్థానీయులతో పాటు భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అక్కడి సంస్థల్లో పని చేయడానికి భారతీయులు అధికంగా వెళ్తుంటారు. యూఏఈ చేసిన హెచ్చరికలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.