Pawan Kalyan: జలియన్ వాలాబాగ్ పై 'ది గార్డియన్ - లండన్' కథనాన్ని షేర్ చేసిన పవన్ కల్యాణ్
- జలియన్ వాలాబాగ్ విషాద ఘటనపై పవన్ స్పందన
- 1919 ఏప్రిల్ 13న పంజాబ్, అమృత్సర్లో మారణహోమం
- 101 ఏళ్లవుతున్న సందర్భంగా అమరవీరులకు సెల్యూట్
బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఒక అమానుష దుశ్చర్యగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ విషాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్, అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగింది. నేటికి ఈ ఘటన జరిగి 101 ఏళ్లు. ఈ నేపథ్యంలో గతంలో ది గార్డియన్- లండన్ ప్రచురించిన కథనాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు.
'లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వాతంత్రాన్ని సాధించాం.. ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. జలియన్ వాలా బాగ్ వంటి వీర చరిత్రలు మనకు స్ఫూర్తివంతం' అని పవన్ పేర్కొన్నారు.
'జలియన్ వాలా బాగ్లో కాల్పుల్లో అమరులైన వారిని స్మరించుకుంటున్నాం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. సెల్యూట్.. జైహింద్' అని పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు.
కాగా, భారత స్వాతంత్రోద్యమానికి అనుకూల ప్రదర్శనల కోసం 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో జనాలు భారీగా గుమికూడారు. దీంతో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయి. అప్పటి కల్నల్ డయ్యర్ ఆదేశాలతో సైనికులు జరిపిన ఈ కాల్పుల్లో వేలాది మంది మృతి చెందారు.