India: అత్యవసరమైన రాపిడ్ టెస్ట్ కిట్స్ సరఫరా మరింత ఆలస్యం: ఐసీఎంఆర్

Rapid Testing Kits Delivery More Delayed
  • లక్షల సంఖ్యలో టెస్టింగ్ కిట్స్ కోసం ఆర్డర్
  • ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ డెలివరీ
  • చైనా కిట్స్ క్వాలిటీతో లేవంటున్న అధికారులు
  • విడివిడిగా ఆర్డర్లు ఇస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలు
కరోనా వైద్య పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు అవసరమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల (ఆర్టీకే) సరఫరా, మరోసారి వాయిదా పడిందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. తొలుత ఆర్టీకేలు ఏప్రిల్ 5 నాటికి అందుబాటులోకి వస్తాయని భావించగా, ఆపై 10వ తేదీకి, దాని తరువాత 15వ తేదీకి వాయిదా పడ్డాయని పేర్కొంది. కరోనాపై పోరాటంలో ఈ టెస్టింగ్ కిట్స్ ఎంతో ఉపకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అనుమానితుని శరీరం నుంచి సేకరించే శాంపిల్స్ నుంచి శరీరంలో యాంటీ బాడీస్ ను అతి తక్కువ సమయంలోనే గుర్తించవచ్చు. దీంతో సదరు వ్యక్తి వైరస్ బారిన పడ్డాడా? లేదా? అన్న విషయం తేలిపోతుంది.

ఈ నేపథ్యంలో తమకు వెంటనే ఆర్టీకేలను సరఫరా చేయాలని కేంద్రంపై వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ విధానంలో కేవలం 30 నిమిషాల్లోనే వైరస్ జాడను తెలుసుకునే వీలుంటుంది. అయితే, ఒకసారి టెస్ట్ చేసిన కిట్ తో మరో పరీక్ష చేసే వీలుండదు. చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావించి, గతంలోనే ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించిన ఐసీఎంఆర్ ఎమిడమాలజీ విభాగం హెడ్ డాక్టర్ రమణ్ ఆర్ గంగాఖేద్కర్, చైనా తయారు చేస్తున్న రాపిడ్ టెస్టింగ్ కిట్స్ అమెరికాకు వెళ్లిపోయాయని వస్తున్న వార్తలపై తానేమీ కామెంట్ చేయబోనని అన్నారు.

అయితే, చైనా నుంచి వచ్చిన టెస్టింగ్ కిట్స్ క్వాలిటీ చాలా తక్కువగా ఉందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఐసీఎంఆర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. క్వాలిటీ లేని ప్రొడక్టులతో చేసే కరోనా పరీక్షలు, సత్ఫలితాలను ఇవ్వబోవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఐసీఎంఆర్ మొత్తం 45 లక్షల రాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో తొలి బ్యాచ్ మే 1 నాటికి, చివరి బ్యాచ్ మే 31 నాటికి అందుతాయని అంచనా. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కిట్ల కోసం విడివిడిగా ఆర్డర్ ఇచ్చాయి.
India
Corona Virus
Rapid Testing Kits
ICMR
China
RTKs

More Telugu News