Vijay Devarakonda: మీరు లాఠీలకు పని చెప్పనంటే వస్తా: పోలీసులతో విజయ్ దేవరకొండ చమత్కారం
- వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సీపీ అంజనీకుమార్
- కరోనా విధుల్లో ఉన్న పోలీసులతో విజయ్ దేవరకొండ చిట్ చాట్
- ప్రజలను చైతన్యపరిచేందుకు తప్పకుండా వస్తానని వెల్లడి
కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేయాలన్నదే ఇప్పుడు దేశంలో అందరి అజెండాగా మారింది. ఇటీవల మరే అంశం జాతిని ఇంతగా ఏకీకృతం చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనాపై పోరులో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఉత్సాహం కలిగించేందుకు వారితో హీరో విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ తనదైన శైలిలో సరదాగా మాట్లాడారు.
మీరు కూడా చెక్ పోస్టుల వద్దకు వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఓ పోలీసు అధికారి కోరగా, మీరు లాఠీలకు పనిచెప్పనంటే తప్పకుండా వస్తానని నవ్వేశారు. అయినా సీఎం కేసీఆర్ గారు బయటికి రావొద్దని స్పష్టం చేశారని, ఇప్పుడు తాను వచ్చి చెబితే ప్రజలు వింటారనుకుంటే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. తాను పోలీసు అధికారిని అయ్యుంటే ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించేవాడ్నని, ఈ పరిస్థితుల్లో పోలీసులపై మరింత గౌరవం పెరుగుతోందని అన్నారు. ప్రజలంతా ఇంట్లో ఉంటే వాళ్ల కోసం రోడ్లమీద డ్యూటీలు చేస్తున్నారని పోలీసులను కొనియాడారు.
భవిష్యత్తులో పోలీసు పాత్రలో నటిస్తానని, అయితే తనకు సరిపడే స్క్రిప్టు రావాలని తెలిపారు. కాగా, ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.