Botsa Satyanarayana: లాక్ డౌన్ పొడిగింపు మంచి నిర్ణయమే: మంత్రి బొత్స
- ‘కరోనా’ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- దేశంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే
- రోజూ రెండు వేల మందికి టెస్టులు చేస్తున్నాం
వచ్చే నెల 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో, ‘కరోనా’ నియంత్రణకు రాష్ట్రంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
‘కరోనా’ హాట్ స్పాట్స్ గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలకు వారి ఇళ్లకే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని, అవసరమైన మందులు కూడా అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని, రోజుకు రెండు వేల మందికి ఈ టెస్టులు చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.