Gavaskar: లాహోర్ లో మంచు కురవొచ్చేమో కానీ భారత్-పాక్ క్రికెట్ సీరీస్ మాత్రం కష్టం: గవాస్కర్
- భారత్, పాక్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక క్రికెట్
- ఉగ్రవాదమే కారణం
- కేవలం ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్న దాయాదులు
ఉగ్రవాదం కారణంగా భారత్ చాన్నాళ్ల క్రితమే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లకు స్వస్తి పలికింది. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రం పాక్ తో ఆడుతోంది. ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజాకు చెందిన యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. లాహోర్ నగరంలో మంచు కురవొచ్చేమో కానీ భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మాత్రం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ టోర్నీలు, ఇతర ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లు ఆడడం కొనసాగించాలని, కానీ ఓ సిరీస్ లో తలపడడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని తేల్చిచెప్పారు.