Hyderabad: లాక్డౌన్ లేకపోతే నేడు నగరమంతా పెళ్లికళ వచ్చేసేది!
- కరోనా విజృంభణే కారణం
- గత ఏడాది ఇదే సమయానికి నగరంలో 12,500 పెళ్లిళ్లు
- దెబ్బతిన్న కోట్ల రూపాయల వ్యాపారం
- నవంబరులో పెళ్లిళ్లు జరిగే అవకాశం
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపుతో వేలాది వివాహాలు జరగకుండా ఆగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 15,000 పెళ్లిళ్లు నిలిచిపోనున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 5,000 ఫంక్షన్ హాళ్లు మూసివేశారు. దీంతో పురోహితులే కాకుండా ఫంక్షన్ హాళ్ల సిబ్బంది, క్యాటరింగ్ సర్వీసులు అందించే వారు ఇలా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.
ఈ సీజన్లో పూలు, పండ్ల వ్యాపారాలు, వివిధ రకాల వస్తువుల విక్రయాలు కూడా అధికంగా జరుగుతాయి. 2019లో ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 12,500 పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వందల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింది.
పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లతో పాటు బట్టల అమ్మకాలు, ఫర్నీచర్ వంటి అనేక రకాల వస్తువులకు గిరాకీ అధికంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ దెబ్బతిన్నాయి. ఈ రోజు నగరంలో అనేక పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. ఇప్పటికే ముహూర్తం పెట్టుకున్న వారు మార్చి రెండో వారంలోనే అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. లాక్డౌన్తో ఇక్కడే ఉండిపోయారు.
నేడు, రేపు, ఎల్లుండి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 25, 26, 29 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. లాక్డౌన్ లేకపోతే నేడు హైదరాబాద్ అంతా పెళ్లిళ్లతో సందడిగా కనపడేది. అలాగే, వచ్చేనెలలో పలు మంచి ముహూర్తాలు ఉన్నాయి. లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఆయా రోజుల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు వాయిదా పడాల్సి వచ్చింది.
వాయిదా పడిన ఈ పెళ్లిళ్లన్నీ ఇక ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. హైదరాబాద్లోని పలు ఫంక్షన్ హాళ్లన్నీ పెళ్లి సందడి కరవై బోసిపోయికనపడుతున్నాయి.