Anil Kumar Yadav: ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తాం: ఏపీ మంత్రి అనిల్‌

anil fires on telugudesam leaders

  • ఇంగ్లిష్‌ మీడియంను హైకోర్టు అడ్డుకుంటే టీడీపీ నేతలకు ఆనందం
  • పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం జగన్‌ తపన
  • ఎలా అడ్డుకోవాలా అని టీడీపీ నేతలు కుట్రలు 
  • పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు? 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుంటే టీడీపీ నేతలకు ఆనందంగా ఉందని, పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం జగన్‌ తపన పడుతుంటే ఎలా అడ్డుకోవాలా అని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు, పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

'చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను అమెరికాలో చదివించుకోవచ్చా? మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో ఎందుకు చేర్పించలేదు? మీకో న్యాయం, పేదలకు మరో న్యాయమా? ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తాం. రాబోయే 20 ఏళ్లలో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తయారుచేస్తాం' అని అనిల్ అన్నారు.

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన మూడు ప్రశ్నలకు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానం చెప్పాలని మంత్రి అనిల్ సవాలు విసిరారు. వాస్తవానికి నిమ్మగడ్డ పేరుతో రాసిన లేఖను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర డ్రాప్ట్‌ చేశారని, ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయంతో తానే లేఖ రాశానని రమేశ్ ఒప్పుకున్నారని ఆయన ఆరోపించారు.
 
చంద్రబాబుకు వయసు మళ్లింది కాబట్టి ఇంట్లో ఉంటే తప్పులేదని, పక్క రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేయడం సరికాదని అనిల్ ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడున్నారు?  కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బయటికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేయాలని ఒక్కరికైనా అనిపించలేదా? అని ఆయన నిలదీశారు.

ప్రభుత్వ యంత్రాంగం, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తుంటే హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు తన చెంచాలను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ విమర్శించారు.

  • Loading...

More Telugu News