Social Distancing: 2022 వరకు భౌతిక దూరం పాటించాల్సిందే: కరోనా వ్యాప్తిపై పరిశోధకులు

Social distancing till 2022 Harvard researchers warn of possible recurrent outbreaks of novel coronavirus

  • ప్రపంచంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ
  • భౌతిక దూరం మాత్రమే కరోనా విజృంభణను అడ్డుకుంటుంది
  • కొవిడ్‌-19 ప్రభావం మరో రెండేళ్ల వరకు ఉంటుంది
  • వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే 2025 నాటికి కరోనా పునరుజ్జీవం

లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌ పరిశోధకులు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే  కొవిడ్‌-19 నుంచి విముక్తి పొందగలమని అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ఆధారంగా చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు పైగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో లాక్‌డౌన్‌ విధించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ ప్రొఫెసర్లు పరిశోధన జరిపారు. పరిశోధన ఫలితాలు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ మార్క్‌ లిప్‌సిట్జ్‌ తెలిపారు. భౌతిక దూరం మాత్రమే కరోనా విజృంభణను అడ్డుకుంటుందని ఆయన చెప్పారు.

కొవిడ్‌-19 ప్రభావం మరో రెండేళ్ల వరకు ఉంటుందని తెలిపిన పరిశోధకులు, లాక్‌డౌన్‌ ఒక్కసారి అమలు చేసినంత మాత్రాన ఆ వైరస్‌ అదుపులోకి రాదని తెలిపారు. నిబంధనలు పాటించకుంటే కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుందని తెలిపారు. ఎండా కాలంలో వేడి కారణంగా కరోనా వ్యాప్తి తగ్గుతుందని కొందరు వేసుకుంటున్న అంచనాలు నిజం కాదని చెప్పారు.

వ్యాక్సిన్ గానీ, కరోనాకు సరైన చికిత్స కానీ అందుబాటులోకి రాకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, 2025 నాటికి కరోనా పునరుజ్జీవం చెందుతుందని హెచ్చరించారు. 'సామాజిక దూరం అనే నిబంధన రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నిబంధన నెలలు, సంవత్సరాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని వల్లే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు' అని పరిశోధకులు వివరించారు.

వ్యాక్సిన్‌ కనుగొనకపోతే సామాజిక దూరం కన్నా ప్రత్యామ్నాయ పద్ధతి ఏదీ లేదని చెప్పారు. దీర్ఘకాలికంగా భౌతిక దూరం పాటించాల్సి ఉందని తెలిపారు. కరోనాకు ఆయుధం వ్యాక్సినే అని, దాన్ని తయారు చేసేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. రోగ నిరోధక శక్తి ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News