Murder: వృద్ధురాలిని తుపాకీతో కాల్చుతుంటే అడ్డుకోవాల్సింది పోయి వీడియో తీశారు!
- ఉత్తరప్రదేశ్ లో దారుణం
- రెండు బుల్లెట్లతో వృద్ధ మహిళ ప్రాణం తీసిన యువకుడు
- వీడియో తీసిన వారిపై న్యాయపరమైన చర్యలు
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. లక్నోలోని కాస్ గంజ్ లో ఈ ఘటన జరిగింది. అయితే, ఆ వృద్ధురాలిని కాల్చే సమయంలో పక్కింటి వారు టెర్రస్ పైనుంచి చూస్తున్నారే తప్ప అడ్డుకొనేందుకు సాహసించలేదు సరికదా, ఆ హత్యోదంతాన్ని ఫోన్ ద్వారా వీడియో తీశారు. ఓ యువకుడు దేశవాళీ తుపాకీతో ఆమెను బెదిరించడం, ఆమె తన ఇంటికి వెళ్లేందుకు పరుగులు తీయడం వీడియోలో కనిపించింది. ఆపై ఉన్నట్టుండి కాల్పులు జరిపిన హంతకుడు రెండు బుల్లెట్లతో ఆ వృద్ధురాలి ప్రాణాన్ని నిలువునా తీశాడు.
ఆమె కాపాడండీ, కాపాడండీ అని అరుస్తున్నా ముందుకు కదలని ఇరుగుపొరుగువారు, ఆ ఘటనను వీడియో తీయడం మంటగలిసిన మానవత్వానికి ప్రతీకలా నిలుస్తోంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడైంది. కాగా, హంతకుడ్ని మోనూ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వృద్ధురాల్ని మోనూ ఎందుకు చంపాడన్నది తెలియరాలేదు. కాగా, హత్య అనంతరం మోనూకు ఆశ్రయం కల్పించేందుకు యత్నించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంచితే, రక్షించకుండా వీడియో తీస్తూ ఉండిపోయిన ఇరుగుపొరుగు వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.