Corona Virus: చైనా పీపీఈ కిట్లు నాసిరకం అని మేము చెప్పలేదు: డీఆర్డీఓ

DRDO denies reports that PPE kits donated by China falied quality tests
  • ఈ నెల 5న చైనా నుంచి భారత్‌కు 1.7 లక్షల కిట్లు
  • వాటిలో 50 వేల  కిట్లు  సామర్థ్య పరీక్షలో విఫలమైనట్టు వార్తలు
  • 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చిన భారత ప్రభుత్వం
కరోనా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న పీపీఈ కిట్లు సామర్థ్య పరీక్ష (క్వాలిటీ టెస్ట్)లో విఫలమయ్యాయన్న వార్తలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) ఖండించింది. హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ లేదా ఇతర విక్రేతల నుంచి తమ వద్దకు పరీక్షలకు వచ్చే కిట్లను తాము పాస్ కానీ, ఫెయిల్ కానీ చేయమని ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు కిట్లను పరీక్షించి ఆ వివరాలను సంబంధిత ఏజెన్సీలకు మాత్రమే చేరవేస్తామని స్పష్టంచేసింది.

ఈ నెల ఐదో తేదీన  చైనా నుంచి ఇండియాకు వచ్చిన 1, 70, 000 పీపీఈల్లో 50 వేల కిట్లు నాసిరకంగా ఉన్నట్టు తేలిందని వార్తలు వచ్చాయి. వీటికి గ్వాలియర్ లోని డీఆర్డీఓ ల్యాబ్ లో పరీక్షలు చేశారని తెలిసింది. అయితే, ఈ వార్తలను డీఆర్డీఓ ఖండించింది.

మన దేశం సీఈ/ఎఫ్ డీఏ అనుమతించిన  పీపీఈ లనే వాడుతోంది. అయితే,  చైనా నుంచి వచ్చిన కిట్స్ ను పలువురు ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వగా.. వాటిలో నాణ్యత లోపించిందన్న వార్తలు వచ్చాయి. కాగా, దేశంలో పీపీఈ ల కొరత తీర్చేందుకు 10 లక్షల కిట్లకు సింగపూర్ సహా పలు కంపెనీలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇవి మే నెలాఖరుకి వచ్చే అవకాశం ఉంది.  భారత్‌కు కనీసం 20 లక్షల పీపీఈ కిట్ల అవసరం ఉంది.

 ప్రస్తుతం చైనా ఎక్కువగా పీపీఈ కిట్స్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలకు అక్కడి నుంచే దిగుమతి చేసుకోవడం తప్పడం లేదు. మరోవైపు  చైనా నుంచి వస్తున్న టెస్టింగ్ కిట్స్, పీపీఈ లలో కూడా చాలా వరకు నాసిరకంగా ఉన్నాయని ఇప్పటికే పలు యూరోప్ దేశాలు ఆరోపించాయి.
Corona Virus
PPE kits
failed
tests
DRDO
denies
reports

More Telugu News