Kumaraswamy: కుమారస్వామి తనయుడి పెళ్లికి 100 మందికి పైగా హాజరు?
- ఓ వ్యవసాయ క్షేత్రంలో నిఖిల్ వివాహం
- పెళ్లికి హాజరైన ఇరు కుటుంబాల బంధుమిత్రులు
- నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలుంటాయన్న డిప్యూటీ సీఎం
లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో అక్కడక్కడా వివాహాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జాబితాలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పెళ్లి కూడా చేరింది. అయితే ఈ సెలబ్రిటీ మ్యారేజి నిర్వహణపై వివాదం ముసురుకుంటోంది.
నిఖిల్ వివాహం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కృష్ణప్ప మనవరాలు రేవతితో కేతగనహళ్లి ఫార్మ్ హౌస్ లో జరిగింది. ఈ వేడుకకు మాజీ ప్రధాని దేవెగౌడ బంధువర్గం నుంచి 60 మంది, పెళ్లికూతురు తరఫు బంధువులు మరో 30 మంది వరకు విచ్చేశారు. అంతేకాదు, ఇరు కుటుంబాల సన్నిహితులు కూడా హాజరయ్యారు.
వాస్తవానికి ఈ పెళ్లిని బెంగళూరు-మైసూరు హైవేకు సమీపంలో భారీ వేదిక నిర్మించి ఎంతో ఘనంగా నిర్వహించాలని కుమారస్వామి తలపోశారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నుంచి రామనగరలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రానికి పెళ్లి వేదికను తరలించారు. అయితే, ఈ పెళ్లిపై అధికార పక్షం మాత్రం మండిపడుతోంది.
బాధ్యతగల రాజకీయనాయకుడు, ప్రజాప్రతినిధి అయ్యుండి కుమారస్వామి అంతమంది సమక్షంలో పెళ్లి చేయడం ఏంటని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి సందర్భంగా కరోనా మార్గదర్శకాలు పాటించలేదని తేలితే మాత్రం మరో ఆలోచనకు తావులేకుండా కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.