Botsa Satyanarayana: చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం: మంత్రి బొత్స
- ‘కరోనా’ కేసుల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదంటారా?
- చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- విశాఖలో పాజిటివ్ కేసులు లేకపోతే ఉన్నట్టు ఎలా చెబుతాం?
ఏపీలో నమోదైన ‘కరోనా’ కేసుల సంఖ్య విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్యను బయటకు చెప్పకుండా ఉంచితే దాగుతాయా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, బాబు, ఆయన కుమారుడు హైదరాబాద్ లో కూర్చుని ఈ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. విశాఖపట్టణంలో పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నామని బాబు ఆరోపిస్తున్నారని, ఆ అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
విశాఖలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా అయినట్టు ప్రభుత్వం ఎలా చెబుతుంది? అని ప్రశ్నించారు. విశాఖలో పాజిటివ్ కేసులు ఉంటే చంద్రబాబు చూపించాలని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కన్నాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కన్నాకు తెలియకపోతే తెలుసుకోవాలని హితవు పలికారు. ఏపీలో మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయబోతున్నామని, కేంద్రంతో కలిసి రాష్ట్ర అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు.