rajnath: కేంద్ర మంత్రుల కీలక భేటీ.. లాక్డౌన్ సడలింపులపై చర్చ
- ఎల్లుండి నుంచి లాక్డౌన్ సడలింపులు
- దేశ ఆర్థిక వ్యవస్థను తిరగి బలపర్చడంపై చర్చ
- ప్రతిపాదనలను మోదీకి సమర్పించనున్న కేంద్ర మంత్రులు
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రుల బృందం భేటీ అయింది. కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఎల్లుండి నుంచి అమలు కానున్న లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. అలాగే, లాక్డౌన్ ఎత్తి వేశాక దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి ఎలా బలపర్చాలన్న అంశాలపై కీలక చర్చలు జరుపుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థను మళ్లీ కొనసాగించాల్సిన తీరు, రైలు సేవల ప్రారంభం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
ఈ భేటీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, రామ్ విలాస్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వస్తువుల సరఫరాకు ఏర్పడుతున్న అడ్డంకులు, వాటి సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపాదనలను నివేదిక రూపంలో వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించనున్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రులు కొందరు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.